GLP-1 Drugs: స్థూలకాయం చికిత్సలో ఉపయోగించే GLP-1 ఆధారిత మందుల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ వంటి మందులను సాధారణ బరువు తగ్గించే ఉత్పత్తుల్లా ప్రచారం చేయడాన్ని అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
వైద్యుల సూచనతోనే వినియోగం:
ఈ మందులు టైప్-2 మధుమేహం చికిత్సతో పాటు నిర్దిష్ట వైద్య ప్రమాణాలు ఉన్న రోగుల్లో దీర్ఘకాలిక బరువు నియంత్రణ కోసం మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదిత వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే వీటిని అందించాలని, ముఖ్యంగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలని సూచించింది. స్వయంగా ఈ మందులు వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
డిజిటల్ ప్రచారాలపై ప్రత్యేక నిఘా:
ఊబకాయం అవగాహన పేరుతో పరోక్షంగా ప్రిస్క్రిప్షన్ లేని మందులను ప్రచారం చేయడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా మార్కెటింగ్ చేయడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం నిర్వహించడం వంటి చర్యలపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది. బ్రాండ్ ప్రచారాన్ని వ్యాధి అవగాహన కార్యక్రమాల రూపంలో నిర్వహించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.
సరఫరా వ్యవస్థపై తనిఖీలు:
తయారీ నుంచి రిటైల్ విక్రయాలు, ఆన్లైన్ ఫార్మసీలు, వెల్నెస్ క్లినిక్‌ల వరకు మొత్తం సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణను పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 49 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన చోట నోటీసులు జారీ చేశారు. అవసరమైతే లైసెన్స్ రద్దు, జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వైద్యుల సలహా లేకుండా బరువు తగ్గించే మందులు వాడకూడదని ఆరోగ్య నిపుణులు మరోసారి సూచిస్తున్నారు.


