హన్మకొండ (బాలసముద్రం): తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ దిక్సూచి ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో గురువారం బాలసముద్రంలో ఘనంగా నిర్వహించారు.
విద్యార్థి ఉద్యమ నాయకుడు బైరపాక ప్రశాంత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ దిక్సూచిగా నిలిచి సరైన దిశానిర్దేశం చేశారని కొనియాడారు. స్వరాష్ట్ర సాధనకై కేసీఆర్ గారి వెంటే ఉండి మార్గదర్శనం చేశారని, తన జీవితాన్నే తెలంగాణ కోసం ధారపోసిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం జయశంకర్ సార్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడమే కాకుండా, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించిందని తెలిపారు. తెలంగాణ ఉన్నంతవరకు జయశంకర్ సార్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ పోరాట యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు
ఇదే ప్రాంగణంలో స్వరాష్ట్ర ఉద్యమ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రథమ జయంతి వేడుకలను కూడా బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు తాళ్లపెల్లి జనార్ధన్ గౌడ్, ఉడతల సారంగపాణి, పులి రజినీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఓరుగల్లును కేంద్రంగా చేసుకుని ఉద్యమాన్ని ముందుండి నడిపిన వీరుడని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమించిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


