హనుమకొండ: నగరంలోని కాకాజి కాలనీలో ఉన్న బాలాజీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి స్పందన లేని రోగికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామంటూ రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుని బంధువుల మధ్య భారీ తోపులాట జరిగింది.
ఘటనకు సంబంధించిన వివరాలు:
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బుల్లికొండ గ్రామానికి చెందిన పంజాల శ్రీధర్ (32) అనే వ్యక్తికి బ్రెయిన్ క్లాట్ సమస్య రావడంతో కుటుంబ సభ్యులు మొదట హనుమకొండ బాలసముద్రంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విజయ టాకీస్ సమీపంలోని మరో ప్రైవేట్ న్యూరో (బాలాజీ) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు అతనికి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు.
అయితే, శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల నుంచే శ్రీధర్‌లో ఎలాంటి కదలికలు, స్పర్శ లేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించారు. దానికి వైద్యులు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా “95 శాతం గ్యారెంటీ లేదు, వేచి చూద్దాం” అంటూ కాలయాపన చేస్తూ రోజువారీ బిల్లులు మాత్రం పెంచుకుంటూ పోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్యశ్రీ ఉన్నా రూ.70 వేలు వసూలు!
ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తున్నప్పటికీ, బాధితుల నుంచి ఇప్పటికే దాదాపు రూ. 70 వేల వరకు నగదు దండుకున్నారని మృతుడి కుటుంబీకులు ఆవేదన చెందారు. తాము ఆర్థికంగా నిరుపేదలమని వేడుకున్నా ఆస్పత్రి యాజమాన్యం కనీస మానవత్వం చూపలేదని, బకాయి బిల్లులు పూర్తిగా చెల్లించే వరకు మృతదేహాన్ని అప్పగించేది లేదని సిబ్బంది తేల్చిచెప్పారని మృతుని బంధువులు వాపోయారు.
బ్రెయిన్ డెత్ దాచి మోసం చేశారనే అనుమానాలు:
వైద్యపరంగా మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిన (బ్రెయిన్ డెత్) పరిస్థితిలోనే వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, గుండె కొట్టుకునేలా చేసి ఆసుపత్రి యాజమాన్యం బిల్లులు పెంచుకుంటూ పోయిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపాలని, బాధ్యులైన ఆస్పత్రి యాజమాన్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


