KNRUHSలో నర్సింగ్ కోర్సుకు నోటిఫికేషన్ : కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) నర్సింగ్ విభాగంలో కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి Nurse Practitioner in Midwifery (NPM) Post Basic Diploma Programmeలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు:
అర్హత కలిగిన ఇన్-సర్వీస్ అభ్యర్థులు ఆగస్టు 8 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 17 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో knruhs.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పూర్తి చేసిన అనంతరం అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన హార్డ్ కాపీలను ఆగస్టు 18లోగా కన్వీనర్‌కు చేరేలా పంపాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 30న ప్రవేశ పరీక్ష:
NPM ప్రవేశ పరీక్షను ఆగస్టు 30న హైదరాబాద్‌లోని నిర్ణీత పరీక్షా కేంద్రంలో కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 26 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అర్హతలు ఇవే:
అభ్యర్థులు Registered Nurse (RN), Registered Midwife (RM)గా నమోదు అయి ఉండాలి. GNM డిప్లొమా లేదా B.Sc. నర్సింగ్ డిగ్రీ కలిగి ఉండటంతో పాటు ప్రసూతి సంరక్షణ విభాగంలో కనీసం రెండేళ్ల తాజా క్లినికల్ అనుభవం ఉండాలి.
ఇన్-సర్వీస్ అభ్యర్థులకే అవకాశం:
ఈ కోర్సులో కేవలం ఇన్-సర్వీస్ అభ్యర్థులకే ప్రవేశం కల్పిస్తారు. శిక్షణ సమయంలో కూడా వారు సాధారణ జీతాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రవేశ సమయానికి అభ్యర్థి వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. తెలంగాణ స్థానిక అభ్యర్థి నిబంధనలను కూడా పాటించాలి.
దరఖాస్తు రుసుము:
OC, BC కేటగిరీల అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ ఫీజు రూ.4,000గా నిర్ణయించారు. SC, ST అభ్యర్థులు రూ.3,000 చెల్లించాలి.


