డేటింగ్ పేరుతో డేంజర్ ట్రాప్.. ‘రెంటల్ బాయ్‌ఫ్రెండ్’పై సీపీ సజ్జనార్ హెచ్చరిక:
హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘రెంటల్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ యువతులను హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనల వెనుక సైబర్ నేరగాళ్ల మోసపూరిత నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ పోస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ :
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన యువకుల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారని సీపీ తెలిపారు. ‘1st August Special – 50% OFF’ అంటూ ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటిస్తూ యువతులను ఆకర్షిస్తున్నారని చెప్పారు. కాఫీ డేట్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా వస్తామంటూ వివిధ ప్యాకేజీలను ప్రచారం చేస్తున్నారని వివరించారు. 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ.4,499గా ధర నిర్ణయించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ముందుగా డబ్బులు తీసుకుని మాయం:
ఏఐ ద్వారా రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువకుల ఫొటోలను ఉపయోగించి ఫేక్ ప్రొఫైల్స్ ఏర్పాటు చేస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. వాటి ద్వారా పరిచయం పెంచుకుని, చాటింగ్‌లో తియ్యటి మాటలతో యువతులను నమ్మిస్తారని చెప్పారు. ఆ తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ వంటి పేర్లతో డబ్బులు చెల్లించాలని కోరుతారని తెలిపారు. డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా నగదు బదిలీ చేయించుకుని, డబ్బులు అందిన వెంటనే అకౌంట్లను బ్లాక్ చేసి అదృశ్యమవుతున్నారని హెచ్చరించారు.
వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దు:
ఇలాంటి ఆన్లైన్ పరిచయాల సమయంలో ఫోన్ నంబర్లు, ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సీపీ సూచించారు. సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి తర్వాత బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం ఉందన్నారు. అపరిచితులను నమ్మి నేరుగా కలవడం కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.
ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించొద్దు:
సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ప్రకటనలను నమ్మి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని సజ్జనార్ సూచించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారని, నేరాలకు పాల్పడుతున్న వారిపై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతులు, తల్లిదండ్రులు సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడిన వారు లేదా అనుమానాస్పద పోస్టులు, ఆఫర్లు కనిపించిన వారు భయపడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.


