వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్.. భారీ ప్రాజెక్టులపై కీలక ప్రకటన:
వరంగల్ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన మహనీయులు, తమ జీవితాలను సర్వం త్యాగం చేసిన ఎందరో ఉద్యమకారులు ఈ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే, పోరాడే చైతన్యం వరంగల్ ప్రజల సొంతమని అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి బాట విజయోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.అంతకుముందు ముఖ్యమంత్రి దాదాపు రూ.484 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.
పరకాలలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాకతీయుల ఘన చరిత్రకు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, ప్రజా పోరాటాలకు వరంగల్ ప్రాంతం నిదర్శనంగా నిలిచిందన్నారు.
వరంగల్ గడ్డ చైతన్యానికి ప్రతీక :
కాకతీయుల పాలన, వారి నిర్మాణాలు, చారిత్రక వారసత్వం వరంగల్ ప్రాంత గొప్పతనానికి ప్రతీకలని సీఎం అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, దాశరథి వంటి మహనీయులు ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేశారని గుర్తు చేశారు.
ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలని, ప్రజలపై ఆధిపత్యం చెలాయించే భావన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని అన్నారు.
భారీ అప్పుల భారం ఉన్నా సంక్షేమానికి పెద్దపీట:
గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీగా అప్పుల భారాన్ని మిగిల్చినప్పటికీ, ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను క్రమబద్ధీకరిస్తూనే రైతులు, మహిళలు, నిరుపేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
నిరుపేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయం:
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడి ఇంటికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో ఆర్థిక, సామాజిక భద్రతను పెంపొందించడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం:
రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశమని సీఎం అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్లు, వరి పంటకు బోనస్ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగగా మార్చి రైతును రాజుగా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు:
మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రజాప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు స్వయంగా వ్యాపారాలు నిర్వహించేందుకు పెట్రోల్ బంకులు, ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళల చేతుల్లో ఆర్థిక వనరులు ఉంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు పిల్లల విద్య, వైద్యం, గృహ అవసరాల్లో వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.
రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు:
నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. వివిధ శాఖల్లో నియామక ప్రక్రియను వేగవంతం చేశామని, మిగిలిన ఖాళీలను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని వెల్లడించారు. యువత ఎలాంటి అపోహలకు గురికాకుండా పోటీ పరీక్షలకు క్రమబద్ధంగా, సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు.
సామాజిక న్యాయమే ప్రజాపాలన లక్ష్యం:
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు.కుటుంబ ప్రయోజనాలకు కాకుండా సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలను సమానంగా అందుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం:
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. వరంగల్ ప్రాంతంలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమ్మక్క–సారలమ్మ దేవతల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల అభివృద్ధికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు:
ప్రజాపాలనలో ఒక్కో సమస్యను గుర్తిస్తూ, ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజల సహకారం, ఆశీర్వాదంతో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు. రైతు, మహిళ, యువత, నిరుపేదలు, అన్ని వర్గాల సంక్షేమం–అభివృద్ధే ప్రజాప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.


