వాహనదారులకు అలర్ట్.. హెడ్లైట్లపై కేంద్రం కొత్త రూల్స్:
భారతీయ రోడ్లపై ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ల తీవ్ర కాంతి కారణంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ఈ కొత్త భద్రతా నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
టూ-వీలర్ల హెడ్లైట్లపై నియంత్రణ :
కొత్తగా తయారయ్యే ద్విచక్ర వాహనాల్లో ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్ సిస్టమ్ కేవలం లో-బీమ్ మోడ్‌లోనే పనిచేసేలా నిబంధనలు మార్చనున్నారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనదారులకు తీవ్రమైన కాంతి వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే హెడ్లైట్ల గరిష్ట ప్రకాశాన్ని కూడా పరిమితం చేయనున్నారు.
కార్లకు కూడా కొత్త పరిమితులు:
ద్విచక్ర వాహనాల హెడ్‌లైట్ తీవ్రతను 1.5 లక్షల క్యాండెలా నుంచి 1 లక్ష క్యాండెలాకు తగ్గించే ప్రతిపాదన ఉంది. నాలుగు చక్రాల వాహనాలకు 2.25 లక్షల క్యాండెలా నుంచి 1.5 లక్షల క్యాండెలాకు పరిమితం చేయనున్నారు. హెడ్‌లైట్ రంగు ఉష్ణోగ్రతను గరిష్టంగా 6,500 కెల్విన్‌కు పరిమితం చేయడం ద్వారా తీవ్రమైన తెల్లటి కాంతి గ్లేర్‌ను తగ్గించనున్నారు.
నగరాల్లో హై-బీమ్‌కు ఆడియో అలర్ట్:
అర్బన్ ప్రాంతాల్లో అవసరం లేకపోయినా హై-బీమ్ ఉపయోగించే వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఆడియో అలర్ట్ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. అయితే గంటకు 60 కిలోమీటర్లకు మించిన వేగంతో హైవేలపై ప్రయాణించే సమయంలో ఈ హెచ్చరిక పనిచేయదు.
భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్ తప్పనిసరి:
రాత్రి వేళల్లో భారీ వాహనాలు స్పష్టంగా కనిపించేలా వాటిపై నాణ్యమైన రిఫ్లెక్టివ్ టేప్స్ ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయనున్నారు. పొగమంచు, వర్షం వంటి పరిస్థితుల్లో ప్రమాదాలను తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.


