వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. నంబర్ 3 వెనుక ఇంత కథ ఉందా? :
భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ప్రారంభమైంది. ఈస్ట్ జోన్ తరఫున వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జెర్సీ ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. జెర్సీ వెనుక ఉన్న నంబర్లో కొంత భాగాన్ని టేప్‌తో కప్పి ఉంచడం మ్యాచ్ సందర్భంగా కనిపించింది.
జెర్సీపై టేప్ ఎందుకు? :
నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే అతడి జెర్సీపై ఉన్న టేప్ వ్యవహారమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఈస్ట్ జోన్ లాజిస్టిక్స్ విభాగం వైభవ్ కోరుకున్న నంబర్‌తో కూడిన జెర్సీని సకాలంలో అందించలేకపోయింది. దీంతో మరో నంబర్ ఉన్న జెర్సీని తీసుకున్న అతడు, తనకు ఇష్టమైన 3వ నంబర్ మాత్రమే కనిపించేలా మిగతా భాగాన్ని టేప్‌తో కప్పేశాడు.
నంబర్ 3 వెనుక సెంటిమెంట్ :
వైభవ్‌కు 3వ నంబర్ జెర్సీపై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడినప్పటి నుంచి భారత జట్టుకు అరంగేట్రం చేసిన సందర్భంలోనూ ఇదే నంబర్‌ను ఉపయోగించాడు.
తల్లి సూచనతోనే ఎంపిక :
అండర్-19 ఆసియా కప్ 2025 సమయంలో తన తల్లి ఇచ్చిన సలహాతో నంబర్ 3ను ఎంచుకున్నట్లు వైభవ్ గతంలో వెల్లడించాడు. తొలుత 12వ నంబర్ తీసుకోవాలని భావించగా, 1+2=3 కాబట్టి నేరుగా 3వ నంబర్‌నే ఎంచుకోవాలని ఆమె సూచించిందట. ఆ తర్వాత ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు భారత జట్టులో చోటు దక్కడం ఈ నంబర్‌పై అతడి నమ్మకాన్ని మరింత పెంచింది. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ భారీగా రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.


