వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దామెర పోలీసులు భారీ స్థాయిలో సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు. సుమారు ₹1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనం, ₹9,000 నగదు మరియు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్‌కుమార్ పర్యవేక్షణలో దామెర పోలీసులు జరిపిన తనిఖీల్లో హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్ రావు (55) అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు.
ఒడిషా నుంచి కొనుగోలు.. ఇతర రాష్ట్రాలకు సరఫరా
పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నాగేశ్వర్ రావు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒడిషా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ అనే వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసేవాడు. అనంతరం తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇతర వ్యాపారులు/ఏజెంట్లు (ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు) ద్వారా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుడి సమాచారం మేరకు అతని ఇంటి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఈ కేసులో ప్రధాన నిందితుడి నుంచి గంజాయి కొనుగోలు చేసిన ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.
యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై తెలంగాణ పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సమాజంలో ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
అధికారులు, సిబ్బందికి అభినందనలు
గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన పరకాల ఏసిపి సతీష్ బాబు, శాయంపేట సి.ఐ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ సి.ఐ సంతోష్, దామెర ఎస్.ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్.ఐ పరమేశ్వర్, పరకాల ఎస్.ఐ రఘుపతిలతో పాటు ఏఏఓ సల్మాన్ పాషా, దామెర, శాయంపేట స్టేషన్ల కానిస్టేబుళ్ళను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


