తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పందించారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, ఈ విషయంలో ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కూతురు వేరు.. రాజకీయం వేరు:
హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుస్మిత వ్యాఖ్యల వివాదంపై స్పందిస్తూ.. ‘‘వివాదం నా బిడ్డది.. ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. కూతురు వేరు.. రాజకీయం వేరు’’ అని స్పష్టం చేశారు. తన కుమార్తె రాజకీయ వ్యాఖ్యల విషయంలో తాను జోక్యం చేసుకోబోమని ఆయన సంకేతాలిచ్చారు.
కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు :
సుస్మిత చేసిన వ్యాఖ్యల కారణంగా తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ను వీడేది లేదని తేల్చిచెప్పారు. ‘‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది’’ అని పేర్కొన్నారు.
కమిటీకి చెప్పాల్సింది చెప్పాం :
ఈ వ్యవహారంపై పార్టీ కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే వివరించామని కొండా మురళి తెలిపారు. సుస్మిత తన ప్లాన్ ఏలో మాట్లాడారని, ప్లాన్ బీలో ఏం మాట్లాడుతారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


