హిమాలయాల్లో మరో జలప్రళయం ముప్పు.. నేపాల్‌కు చైనా హెచ్చరిక..:
హిమాలయ ప్రాంతాల్లో భూకంపం అనంతరం సంభవించిన జలప్రళయం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ.. మరో జలప్రళయం ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. మరో మూడు రోజుల్లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉందని నేపాల్‌ను అప్రమత్తం చేసింది.
సరస్సులోకి భారీగా నీరు:
నేపాల్ ఎగువ హిమాలయ ప్రాంతంలో ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్సో నదులు కలిసే ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన భారీ సరస్సు ఉంది. ఇటీవల పర్వత ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఈ సరస్సులోకి భారీగా నీరు చేరుతున్నట్లు చైనా పేర్కొంది. పర్వతాల్లోని సహజ జలాశయాల ఆనకట్టలు తెగిపోవడంతో నీటి ప్రవాహం మరింత పెరిగినట్లు తెలిపింది.
ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరితే ప్రమాదం:
ఆగస్టు 27 మధ్యాహ్నానికి సరస్సులో సుమారు 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు చైనా అంచనా వేసింది. రాబోయే మూడు రోజుల్లో మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో సరస్సులో నీటి పరిమాణం 5 మిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరితే సహజ ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
నేపాల్‌లో హై అలర్ట్:
సరస్సు ఆనకట్టలు తెగితే భారీ స్థాయిలో వరదలు సంభవించే అవకాశం ఉందని చైనా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ వరదల ప్రభావం గత జలప్రళయం కంటే తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించాయి. చైనా తాజా హెచ్చరికల నేపథ్యంలో నేపాల్ అధికారులు అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు.


