రేవంత్‌తో విభేదాల ఎఫెక్ట్.. కొండా సురేఖపై హైకమాండ్ కీలక నిర్ణయం? :
తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం హస్తినకు బయలుదేరగా.. మంత్రి కొండా సురేఖ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు, మంత్రి కొండా సురేఖ, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక ఇప్పటికే హైకమాండ్‌కు చేరినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలపై ఉత్కంఠ :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేయడం, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే అంశాలను ప్రస్తావిస్తూ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే వారిని కేవలం పార్టీ పదవుల నుంచి తప్పిస్తారా? లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ :
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చించి, హైకమాండ్‌కు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు సమాచారం. అవసరమైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలోనూ ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
పార్టీ పదవి పోతే.. సురేఖ నిర్ణయం ఏంటి? :
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ హైకమాండ్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆమె తదుపరి నిర్ణయం ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ వ్యవహారానికి మంగళవారం క్లైమాక్స్ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


