చిరంజీవి విషెస్‌కి పవన్ ఫ్యాన్స్ ఫిదా.. మెగా రేంజ్ అంటే ఇదే :
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌ను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆయనపై తనకున్న ప్రేమ, గర్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా పవన్ వ్యక్తిత్వం, ప్రజాసేవపై ప్రశంసలు కురిపిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’ అంటూ..:
“కళ్యాణ్ బాబు అంటేనే లక్ష్యంపై స్పష్టత, ఆచరణలో పట్టుదల. చిన్ననాటి నుంచే ఆయనలో ప్రజల పట్ల ఉన్న ఆప్యాయత, బాధ్యతను నేను గమనిస్తూ వచ్చాను. ఏ పని చేపట్టినా దానిపై సంపూర్ణంగా దృష్టి పెట్టడం, తాను వేసే ప్రతి అడుగు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకోవడం ఆయన ప్రత్యేకత. ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన, ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.” మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది” అని చిరంజీవి పేర్కొన్నారు.
పవన్‌పై అన్నయ్య చిరంజీవి ప్రశంసలు:
తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
కళ్యాణ్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, మరింత ఉత్సాహం, శక్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ప్రార్థిస్తూ.. నా తమ్ముడు కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి తన అభిమానాన్ని, ఆశీస్సులను తెలియజేశారు.
తమ్ముడిపై చిరంజీవి చూపించిన ప్రేమ, ఆప్యాయత, పవన్ ప్రజాసేవపై చేసిన ప్రశంసలు ప్రస్తుతం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్నదమ్ముల అనుబంధానికి ఈ పోస్ట్ మరోసారి నిదర్శనంగా నిలిచిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


