తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై ఆమె నేరుగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
‘రేవంత్ పదేళ్లు సీఎం అంటున్నారు’ :
రేవంత్‌రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లోని పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, సీఎం సహా మంత్రులు, నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. హైకమాండ్‌కు మొత్తం అంశాలను రాతపూర్వకంగా వివరించినట్లు తెలిపారు.
‘బీసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?’ :
తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తనను ఎందుకు శిక్షించాలని సురేఖ ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ :
అంతా సద్దుమణిగిందని భావిస్తున్న సమయంలో సురేఖ చేసిన తాజా వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశమేంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీలో జరిగిన చర్చలు ఆశించిన స్థాయిలో ఫలించకపోవడంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ఆమెపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.


