తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్‌లోని మామూనూరు విమానాశ్రయాల నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడిని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో ఉన్న పౌర విమానయాన శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సీఎం సమావేశమయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి కావలసిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
శంకుస్థాపనకు కేంద్రం అంగీకారం
ఈ సమావేశంలో సీఎం విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో టెండర్లను పిలిచి, డిసెంబర్ నాటికి ప్రక్రియను ఖరారు చేస్తామని తెలిపారు. అనంతరం డిసెంబర్‌లోనే విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో సదుపాయాలు
ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినళ్లతో పాటు ఎంఆర్‌వో వసతులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే ఆదిలాబాద్‌లో రన్ వే ఖరారు చేయడానికి వీలుగా రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హెలీ టూరిజం, సీ-ప్లేన్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి చాపర్ల ద్వారా ‘హెలీ టూరిజం’ను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. కాగా, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ‘సీ-ప్లేన్’ ల్యాండింగ్‌కు సంబంధించి తుది నివేదికను రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


