హనుమకొండ ధర్మసాగర్ మండలం సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం నాడు వైభవంగా ప్రారంభించారు.
ముందుగా ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా ఇడ్లీ, సాంబార్‌తో కూడిన అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు హాజరైన విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపురావుతో మాట్లాడుతూ… ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ పంపిణీ, రెమెడియల్ తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న ఎఫ్ఎల్ఎన్ వర్క్ బుక్‌ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
అంగన్వాడీ కేంద్రం తనిఖీ
పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, చిన్నారుల హాజరును పరిశీలించారు. అంగన్వాడీ పిల్లలతో ముచ్చటిస్తూ రైమ్స్, గోడలు మరియు చార్టులపై ఉన్న పక్షులు, జంతువుల బొమ్మలను చూపిస్తూ పేర్లు అడుగగా, చిన్నారులు ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడాలి లక్ష్మి, డీఈవో గిరిరాజు గౌడ్, తహసిల్దార్ బావ్ సింగ్, ఎంఈఓ శ్రీదేవి, ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రశాంతి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ రమాదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


