ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ రాష్ట్ర పర్యాటక అవార్డులు–2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. పర్యాటక రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు తదితరులకు వివిధ కేటగిరీల్లో అవార్డులు అందించనున్నారు.
పలు విభాగాల్లో అవార్డులు :
రచన, ప్రచురణ, తెలంగాణ పర్యాటకంపై ఉత్తమ చిత్రం, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, పర్యాటక గైడ్లు, గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులు వంటి విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. పర్యాటక విద్యాసంస్థలు, వైద్య పర్యాటకం, వినోద పార్కులు, వినూత్న పర్యాటక ప్రాజెక్టులు, సోషల్ మీడియా, యువ పర్యాటక క్లబ్‌లకు కూడా పురస్కారాలు ప్రకటించనున్నారు.
పనితీరుకు ప్రత్యేక ప్రాధాన్యం :
హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల ఎంపికలో పనితీరు, పరిశుభ్రత, వాతావరణం, సేవలు, సౌకర్యాలు, పర్యాటకుల సంఖ్య, టర్నోవర్, విదేశీ మారకద్రవ్య ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తారు. పర్యావరణహిత చర్యలు, దివ్యాంగులకు అందిస్తున్న సౌకర్యాలు, పునరుత్పాదక ఇంధన వినియోగం, వ్యర్థాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
సెప్టెంబర్ 7లోగా దరఖాస్తులు :
తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన పర్యాటక సంబంధిత వ్యాసాలు రచన విభాగానికి అర్హత పొందుతాయి. అవసరమైన విభాగాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ లేదా చట్టబద్ధ ఆడిటర్ ధ్రువపత్రాలను సమర్పించాలి. ప్రత్యేక కమిటీలు దరఖాస్తులను పరిశీలించి, అవసరమైతే సంబంధిత పర్యాటక ప్రాంతాలు, సంస్థలు, హోటళ్లు, రిసార్టులను సందర్శించి వివరాలను పరిశీలిస్తాయి.
అర్హత ఉన్న వారు మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు, ధ్రువపత్రాలు, ఫొటోలు, ఇతర ఆధారాలతో కూడిన దరఖాస్తులను సెప్టెంబర్ 7, 2026లోగా సమర్పించాలి. దరఖాస్తులను డైరెక్టర్, పర్యాటక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కళా భవన్, రవీంద్ర భారతి, సైఫాబాద్, హైదరాబాద్–500004 చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం 9440816065, 9440816068 నంబర్లను సంప్రదించవచ్చు.


