తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రి పదవి నుంచి తన తొలగింపుపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బర్తరఫ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
అధిష్ఠానాన్ని బెదిరించారని ఆరోపణ :
తనను మంత్రివర్గం నుంచి తొలగించకపోతే తాను పార్టీని వీడతానని సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని బెదిరించారని సురేఖ పేర్కొన్నారు. ఇటీవల రాఖీ కట్టిన సమయంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని చెప్పారు. వాస్తవానికి తనను మంత్రి పదవి నుంచి తొలగించే ఆలోచన పార్టీకి లేదని ఆమె అన్నారు.
తనపై కుట్ర జరిగిందని వ్యాఖ్య :
కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి తనపై కుట్ర చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఈ పరిణామాల వెనుక అసలు కారణాలను తాను, తన భర్త కొండా మురళి చర్చించిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యేగా కొనసాగడంపైనా కీలక వ్యాఖ్యలు:
తాను ఎమ్మెల్యేగా కొనసాగాలా లేదా అనే విషయంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని సురేఖ తెలిపారు. దీనిపై తన భర్తతో చర్చించిన అనంతరం మిగతా విషయాలను బయటకు వెల్లడిస్తానని చెప్పారు.
సుమంత్‌పై అనవసర ప్రచారం :
రేవంత్ కుటుంబానికి సంబంధించిన అంశాలు అధిష్ఠానానికి తెలియవా? అని ఆమె ప్రశ్నించారు. సుమంత్ ఎలాంటి తప్పు చేయలేదని, అతడిని అనవసరంగా బద్నాం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీసీలకు ప్రాధాన్యం కల్పించేలా ఇటీవల జరిగిన నియామకాలపై స్పందిస్తూ.. వారికి తన శుభాకాంక్షలు తెలిపారు.


