తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు, నేతల బహిరంగ విమర్శలు, అసంతృప్త వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం (AICC) తీవ్రస్థాయిలో మండిపడింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతున్నారు, వెనుక ఉండి ఎలాంటి రాజకీయాలు నడుపుతున్నారనే దానిపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇకపై ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పింది.
సహనానికి హద్దు ఉంటుంది…
“పార్టీ నేతల ఓపికకు, అధిష్టాన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదు… కఠిన చర్యలు తప్పవు” అని కాంగ్రెస్ వర్గాలు హెచ్చరించాయి. ఏఐసీసీ తీసుకున్న స్పష్టమైన నిర్ణయంతోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించామని ప్రస్తావించిన హైకమాండ్, అధిష్టానం నియమించిన సీఎంపై తరచూ బహిరంగంగా విమర్శలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని పేర్కొంది.
సొంత పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే నాయకులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని సూచించింది. లేనిపక్షంలో విచారణ లేకుండానే క్రమశిక్షణా కమిటీ ద్వారా వేటు వేసేందుకు వెనకాడబోమని హెచ్చరించింది. పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న చర్చలు మరియు నాయకుల వ్యాఖ్యలను ఏఐసీసీ నిశితంగా పరిశీలిస్తోందని, రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు తప్పవని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


