వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. MBBS సీటు సాధించడమే లక్ష్యంగా కొందరు అభ్యర్థులు తమ SC ఉపకులాల కేటగిరీలను మార్చి అక్రమాలకు తెరలేపారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తక్షణ విచారణకు ఆదేశించింది.
కేటగిరీ మార్చి సీటు పొందేందుకు యత్నం
2024-25 విద్యా సంవత్సరంలో MBBS ప్రవేశాల కోసం సమర్పించిన దరఖాస్తుల్లో కొందరు అభ్యర్థులు తమను SC కేటగిరీ-3 కింద నమోదు చేసుకున్నారు. అయితే ఆ ఏడాది సీటు రాకపోవడంతో, ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియలో తమ కేటగిరీని SC-1 గా మార్చి నకిలీ ధ్రువపత్రాలను అప్లోడ్ చేశారు. మెరిట్ పరంగా లబ్ధి పొందేందుకే ఈ విధంగా కేటగిరీ మార్పునకు పాల్పడినట్లు తేలింది.
మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు
గతేడాది SC-3 కింద దరఖాస్తు చేసిన ఒక అభ్యర్థి, ఈసారి SC-1 గా ఎలా మారారనే అంశంపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ గురువారం విశ్వవిద్యాలయ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన వర్సిటీ యంత్రాంగం ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఈ తరహా మోసానికి పాల్పడినట్లు గుర్తించింది.
కఠిన చర్యలకు సిద్ధమైన వర్సిటీ
రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు అభ్యర్థులపై చట్టపరమైన, అకడమిక్ చర్యలు తీసుకునేందుకు యూనివర్సిటీ సిద్ధమైంది. అర్హులైన ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా అప్లికేషన్లను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రవేశాల ప్రక్రియలో భాగంగా వర్సిటీ ఇప్పటికే మెరిట్ జాబితాను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


