మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ తొలిసారి స్పందించారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె.. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు సురేఖ ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
త్వరలో కీలక ప్రకటన :
“నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా” అంటూ సురేఖ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామాల నేపథ్యంలో ఆమె తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఆమె తీసుకోబోయే నిర్ణయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
తల్లి బర్తరఫ్‌పై కుమార్తె ఆగ్రహం :
మరోవైపు, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంపై ఆమె కుమార్తె సుస్మిత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన తల్లిపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవేనని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కొండా కుటుంబం ‘ప్లాన్ బీ’ ఏంటి? :
తన తల్లిపై చర్య తీసుకోవడం బాధ కలిగించిందని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా మురళి వ్యవహారశైలి కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీంతో కొండా కుటుంబం తదుపరి వ్యూహం ఏమిటనే ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది. సురేఖ ప్రకటించబోయే నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.



