డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో రోజువారీ పనులు మరింత సులభమయ్యాయి. అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్, వాయిస్ క్లోనింగ్, ఫిషింగ్ లింకులను సృష్టిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాల నుంచి ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.
నకిలీ కాల్స్, మెసేజ్‌లతో జాగ్రత్త :
మన పేరు, సంస్థ పేరు లేదా వ్యక్తిగత వివరాలతో వచ్చిన ప్రతి మెసేజ్‌ను నిజమైనదిగా భావించకూడదు. ఏఐ సాయంతో వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ సందేశాలను సులభంగా రూపొందించవచ్చు. అందువల్ల మెసేజ్ పంపిన వ్యక్తి వివరాలు, లింక్ ఉన్న వెబ్సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే స్పందించాలి.
వాయిస్ క్లోనింగ్‌తో మోసాలు :
ఏఐ వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువులు, స్నేహితుల గొంతును పోలిన స్వరాన్ని సృష్టించి అత్యవసరంగా డబ్బు కావాలని అడిగే మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నమ్మకుండా, మీకు మాత్రమే తెలిసిన ప్రశ్న అడిగి వ్యక్తిని నిర్ధారించుకోవాలి. అనుమానం ఉంటే ఇప్పటికే సేవ్ చేసిన ఫోన్ నంబర్‌కు తిరిగి కాల్ చేసి వివరాలను ధృవీకరించాలి. వీడియో కాల్లో కనిపించిన వ్యక్తినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త వహించాలి.
ఓటీపీ, పిన్ వివరాలు చెప్పొద్దు :
బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి కీలక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదు. ఖాతా బ్లాక్ అవుతుందని లేదా వెంటనే చర్య తీసుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే తొందరపడకుండా ముందుగా నిజానిజాలు తెలుసుకోవాలి.
ఫిషింగ్ లింకులపై అప్రమత్తత :
ఏఐతో రూపొందించిన నకిలీ వెబ్సైట్లు, ఫిషింగ్ లింకులు అసలైనవాటిలాగే కనిపించే అవకాశం ఉంది. కాబట్టి లింక్‌పై క్లిక్ చేసే ముందు వెబ్ అడ్రస్‌ను పూర్తిగా పరిశీలించాలి. సోషల్ మీడియాలో కనిపించే అనుమానాస్పద ప్రమోషన్లు, భారీ లాభాల పెట్టుబడి ఆఫర్ల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనుమానం కలిగించే సందేశాలకు స్పందించకుండా వదిలేయడం సైబర్ మోసాలను నివారించేందుకు ఉత్తమ మార్గం.


