భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే మనుషులు, సరుకులను అంతరిక్షానికి తరలించేలా ‘స్పేస్ ఎలివేటర్’ నిర్మాణంపై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలో ఏర్పాటు చేసే ఈ భారీ కేబుల్ భూస్థిర కక్ష్యను దాటి అంతరిక్షంలోకి విస్తరించేలా ఉంటుంది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే అంతరిక్ష ప్రయాణ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
66 వేల మైళ్ల పొడవైన కేబుల్ :
ప్రతిపాదిత స్పేస్ ఎలివేటర్ భూమి నుంచి దాదాపు 66 వేల మైళ్ల దూరం వరకు విస్తరించేలా రూపొందించనున్నారు. కేబుల్‌పై ప్రత్యేక ఎలివేటర్ వ్యవస్థను ఉపయోగించి మనుషులు, సరకులను పైకి తరలించాలనేది ప్రణాళిక. ఇలా చేయడం ద్వారా ప్రతి ప్రయాణానికి భారీ రాకెట్లను ప్రయోగించాల్సిన అవసరం తగ్గుతుంది.
గ్రాఫీన్‌పై శాస్త్రవేత్తల ఆశలు :
ఇంత భారీ కేబుల్‌ను నిర్మించేందుకు అత్యంత తేలికైనదిగా, అదే సమయంలో అపారమైన బలాన్ని కలిగిన పదార్థం అవసరం. ఉక్కుతో పోలిస్తే వంద రెట్లు బలమైన పదార్థాల కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పాలీక్రిస్టలైన్ గ్రాఫీన్’పై నిపుణులు ఆశలు పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ ఎలివేటర్ కన్సార్టియం కూడా దీనిని కీలక ప్రత్యామ్నాయంగా పరిగణిస్తోంది.
దక్షిణ కొరియాలో కీలక ప్రయోగం :
గ్రాఫీన్ ఆధారిత నిర్మాణాల విషయంలో దక్షిణ కొరియా ఇంజినీర్లు ఇప్పటికే పురోగతి సాధించినట్లు సమాచారం. సుమారు 1,000 మీటర్ల పొడవు, అర మీటర్ వెడల్పుతో గ్రాఫీన్ నిర్మాణాన్ని తయారు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అంతరిక్ష ఎలివేటర్‌కు అవసరమైన స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం ఇప్పటికీ పెద్ద సవాలే.
అంతరిక్ష వ్యర్థాలతో ముప్పు :
స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో అంతరిక్ష వ్యర్థాలు కూడా ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. కేబుల్ దెబ్బతినకుండా పలు కేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక భద్రతా వ్యవస్థలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తగ్గనున్న అంతరిక్ష ప్రయాణ ఖర్చులు :
స్పేస్ ఎలివేటర్ వాస్తవ రూపం దాల్చితే అంతరిక్ష ప్రయాణ వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భూస్థిర కక్ష్యకు చేరుకోవడానికి సుమారు రెండు వారాలు పట్టవచ్చని, అక్కడి నుంచి చంద్రుడిని దాదాపు 14 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. సాంకేతిక సవాళ్లను అధిగమించి నిర్మాణం ప్రారంభించినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి 10 నుంచి 20 ఏళ్ల వరకు సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కల సాకారమైతే అంతరిక్ష ప్రయాణ రంగంలో ఇది చారిత్రాత్మక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.


