ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు పలు పరీక్షలు నిర్వహించగా అనూహ్య విషయం బయటపడింది.
స్కానింగ్‌లో విస్తుపోయే దృశ్యం :
స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మహిళ కడుపులో ఏకంగా 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక క్యాండిల్ ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి వస్తువులు కడుపులో ఉండటంతో వైద్యులు వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేశారు.
ల్యాప్రోస్కోపీతో తొలగింపు :
వైద్య బృందం ల్యాప్రోస్కోపీ సర్జరీ నిర్వహించి కడుపులో ఉన్న వస్తువులను విజయవంతంగా బయటకు తీసింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సకాలంలో చికిత్స అందడంతో ఎలాంటి ప్రాణాపాయం తప్పినట్లు వెల్లడించారు.
అసలు ఎలా జరిగిందనే దానిపై ఆరా.. :
అయితే ఇన్ని వస్తువులు మహిళ కడుపులోకి ఎలా వెళ్లాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె స్వయంగా వాటిని మింగారా? లేదా ఎవరైనా బలవంతంగా తినిపించారా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె స్వయంగా మింగి ఉంటే, అందుకు కారణాలేమిటనే కోణంలోనూ కుటుంబ సభ్యులు, వైద్యులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన నరసరావుపేటలో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. మహిళ కడుపులో ఇంత పెద్ద మొత్తంలో వస్తువులు ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


