ములుగు: వెంకటాపూర్ మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం పునఃప్రారంభమైంది. రామప్ప ఆలయంలో కొలువైన రుద్రేశ్వరుడికి ఇకపై సంప్రదాయ పద్ధతిలో జలాభిషేకం జరిగే అవకాశం ఏర్పడింది.
భూకంపంతో మూసుకుపోయిన సోమసూత్రం :
17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం కారణంగా ఆలయ గర్భగుడి నుంచి అభిషేక జలం బయటకు వెళ్లే సోమసూత్రం మూసుకుపోయింది. దీంతో స్వామివారికి పూర్తిస్థాయిలో జలాభిషేకం నిర్వహించడం సాధ్యం కాలేదు. అప్పటి నుంచి ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజాగా శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులతో పనులు చేపట్టారు.

ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరణ :
ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందుకోసం 3డీ మ్యాపింగ్, ఎండోస్కోపిక్ కెమెరాలు, జీవోప్రో కెమెరాలను వినియోగించారు. రియల్‌టైమ్ మానిటరింగ్ స్క్రీన్ల ద్వారా లోపలి పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ పనులు కొనసాగించారు.
సోమసూత్రంలో పేరుకుపోయిన అడ్డంకులను సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానంలో పొరల వారీగా తొలగించారు. దీంతో శతాబ్దాలుగా మూసుకుపోయిన మార్గం తిరిగి అందుబాటులోకి వచ్చింది.
ఏఎస్ఐ పర్యవేక్షణలో పనులు :
దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పునరుద్ధరణ ప్రక్రియ సాగింది. ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, కేంద్ర పురావస్తు శాఖ డీఈ కృష్ణచైతన్య, ఉమ్మడి వరంగల్ జిల్లా సీఏలు మల్లేష్, కృష్ణవంశీ, రామప్ప ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ తదితరుల సమక్షంలో పనులు నిర్వహించారు.
సోమసూత్రం పునరుద్ధరణతో రామప్ప ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక వైభవంలో మరో కీలక ఘట్టం నమోదైంది.


