హనుమకొండ: రాష్ట్ర సేవికా సమితి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, హనుమకొండలోని చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం “ప్రణవ నాదం” పేరిట నిర్వహించిన సామూహిక ఘోష్ ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. 90 మంది సేవికలు ప్రదర్శించిన ఈ ఘోష్ ప్రదర్శన భక్తులను, నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలబోతగా సాగిన ఈ కార్యక్రమం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంప్రదాయ వేషధారణలో విచ్చేసిన మహిళలు, యువతులు, బాలికలు ఆనక్ (డ్రమ్), వంశీ, ఝల్లరి, శంఖం వంటి వివిధ వాద్య పరికరాలతో దేశభక్తిని పెంపొందించే సాంప్రదాయ ట్యూన్స్ ను ప్రతిభావంతంగా వాయించారు. ఈ ప్రదర్శన సేవికల శారీరక, మానసిక దృఢత్వానికి, వారి ప్రతినిత్య శిక్షణకు, సమయపాలనకు నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ ప్రొద్దుటూరి రూప మాట్లాడుతూ… మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశ సేవ పట్ల అనురక్తిని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ధర్మ, సమాజ, సంస్కృతుల పరిరక్షణలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, ప్రాచీన కళలను భావి తరాలకు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ధర్మ రక్షణ, సమాజ సేవ అనే రెండు కళ్ళుగా సమితి పనిచేస్తుందని చెప్పారు. ప్రదర్శన అనంతరం సేవికలంతా భారతమాతకు ప్రణామం చేస్తూ ప్రార్థన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. మాలతి, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అసిస్టెంట్ లెక్చరర్ కుమారి హరి విజయశ్రీ, జీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మంతెన శిరీష, రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సంచాలిక డాక్టర్ మాగంటి అరుణ, ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ, విభాగ్ కార్యవాహిక పోకల జ్యోతి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల కార్యవాహికలు సముద్రాల కవిత, అర్చన, వాంకుడోత్ జ్యోతిలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది సేవికలు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


