ఎల్బీనగర్: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. భయాందోళనకు గురిచేసి ఓ వృద్ధురాలి నుంచి రూ. 21 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్కేపురం కాలనీకి చెందిన నాగలక్ష్మి (68) అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఇటీవల ప్రసాద్ అనే వ్యక్తి టెలికాం అధికారినంటూ ఆమెకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత రాజేశ్‌కుమార్ అనే మరో వ్యక్తి తాను న్యాయ సలహాదారుడినంటూ పరిచయం చేసుకున్నాడు. బాధితురాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు.
అనంతరం సైబర్ కేటుగాళ్లు సీబీఐ, పోలీసు అధికారుల అవతారమెత్తి వీడియో కాల్ ద్వారా విచారణ పేరిట నాగలక్ష్మిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. అరెస్టు భయంతో ఆందోళన చెందిన ఆమె, నిందితులు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా రూ. 21 లక్షలు బదిలీ చేసింది. అయినప్పటికీ, ఇంకా డబ్బులు పంపాలని నిందితులు ఒత్తిడి తేవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు, ఈ నెల 5న తన కుమారుడికి విషయాన్ని తెలిపింది.
బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్పందిస్తూ… పోలీసు, సీబీఐ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో బెదిరిస్తూ వీడియో కాల్స్ చేస్తే ఎవరూ భయపడవద్దని, ఎలాంటి డబ్బులు బదిలీ చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


