హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణల పేరిట తెలంగాణలోని ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. హనుమకొండ పర్యటనలో భాగంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆమె విమర్శించారు.
రాజకీయాలు అంటే కేవలం హల్చల్ చేయడానికి కాదని, ప్రజా సమస్యలపై పోరాడేందుకే ఉండాలని ఆమె హితవు పలికారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ చేపడుతున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రాజకీయంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


