తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేతను కించపరిచేలా మాట్లాడారంటూ ఎస్సీ కాంగ్రెస్ నేతలు, పలు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటనకు నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు ఎస్సీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ముఖ్యమైన ఆందోళన కార్యక్రమాలు:
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడించాలని ఎస్సీ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఫామ్‌హౌస్ ఎదుట డప్పులతో నిరసన తెలిపేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఎదుట ధర్నాలకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్, కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యల వ్యవహారంపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను అవమానించడం దళిత సమాజంతో పాటు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని నేతలు మండిపడుతున్నారు. తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతల నిరసనల పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యాలయాలు, కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పోలీసు యంత్రాంగం భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను పెంచింది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


