హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు M-FAST, SOT ఉప్పల్ బృందాలు భరత్‌నగర్ కాలనీలోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో తనిఖీలు చేపట్టాయి.
గడువు ముగిసిన పదార్థాల గుర్తింపు :
తనిఖీల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్పత్తుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు, పరిసరాలను అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కెంపేగౌడ దేవరాజ్ నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పలు పదార్థాలు స్వాధీనం :
దాడుల్లో బ్లూ స్టార్ సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన Bakersville Colourmist లిక్విడ్ ఫుడ్ కలర్స్, Bush Sweet Orange ఫుడ్ ఫ్లేవర్, లేబుల్ లేని సింథటిక్ ఫుడ్ కలర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే Real Fruit Power Guava, Pillsbury Cake Mix, Cust N Crumb Powder, Diamond Cake Improver, Classic ఫుడ్ కలర్ ఫ్లేవర్స్, Goodrich Glaze Cake Improver వంటి పదార్థాలను కూడా గుర్తించారు.
నిబంధనలపై అధికారుల దృష్టి :
ఆహార పదార్థాల నిల్వ, గడువు, లేబులింగ్, పరిశుభ్రత ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలపై తదుపరి పరీక్షలు, అధికారిక విచారణ కొనసాగుతున్నాయి. దర్యాప్తు పూర్తైన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


