ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ఈవెంట్లోనే కంపెనీ సంచలన ప్రకటన చేసింది. ఆపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ iPhone Duoను పరిచయం చేసింది. ఇది సాధారణ ఐఫోన్‌కు భిన్నంగా పుస్తకం మాదిరిగా మధ్యలో మడుచుకునేలా రూపొందించారు. అమెరికాలో దీని ప్రారంభ ధర $1,999 కాగా, భారత్‌లో రూ.2,99,900 నుంచి లభించనుంది.
ఫోన్ ఎలా పనిచేస్తుంది? :
ఐఫోన్ డ్యూయోలో రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఫోన్ మూసి ఉంచినప్పుడు 5.4 అంగుళాల బయటి స్క్రీన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. ఫోన్‌ను తెరిస్తే 7.6 అంగుళాల లోపలి Super Retina XDR డిస్ప్లే అందుబాటులోకి వస్తుంది. ప్రిసిషన్ హింజ్ కారణంగా ఫోన్‌ను సులభంగా తెరవడం, మూయడం సాధ్యమవుతుంది. రెండు స్క్రీన్లలో కంటెంట్ ఒకే రకమైన యాస్పెక్ట్ రేషియోలో ఉండేలా ఆపిల్ డిజైన్ చేసింది.
సాధారణ ఫోన్లతో అసలు తేడా ఏంటి? :
సాధారణ ఐఫోన్లో ఒకే ప్రధాన డిస్ప్లే ఉంటుంది. కానీ Duoలో ఫోన్ పరిమాణం పెద్దగా పెంచకుండానే ట్యాబ్లెట్ తరహా స్క్రీన్‌ను పొందవచ్చు. 7.6 అంగుళాల డిస్ప్లేపై ఒకేసారి రెండు యాప్‌లను పక్కపక్కనే ఉపయోగించే Split View సదుపాయం ఉంది. వీడియోలు చూడటం, గేమింగ్, డాక్యుమెంట్లు చదవడం, వీడియో కాల్స్ వంటి పనులకు పెద్ద స్క్రీన్ ఉపయోగపడుతుంది.
కెమెరాలోనూ కొత్త అనుభవం :
ఫోల్డబుల్ డిజైన్‌ను కెమెరా కోసం కూడా ఉపయోగించారు. వెనుక కెమెరాలతో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు బయటి డిస్ప్లేపై ప్రివ్యూ చూసుకోవచ్చు. అలాగే Duo Preview, Smart Take, Duo FaceTime వంటి ఫీచర్లు ఫోన్ మడత డిజైన్‌ను ప్రత్యేకంగా ఉపయోగించుకునేలా చేస్తాయి. లోపలి డిస్ప్లే కింద FaceTime కెమెరాను అమర్చారు.
పనితీరు, బ్యాటరీ :
ఐఫోన్ డ్యూయోలో కొత్త A20 Pro చిప్, అధునాతన థర్మల్ మేనేజ్మెంట్ కోసం వేపర్ చాంబర్, డ్యూయల్-బ్యాటరీ ఆర్కిటెక్చర్ ఉన్నాయి. iOS 27ను కూడా ఫోల్డబుల్ డిజైన్‌కు అనుగుణంగా మార్చారు. Apple Pencil (USB-C)కు కూడా సపోర్ట్ అందించనుంది.
మొత్తంగా చూస్తే, iPhone Duo లక్ష్యం ఒకే పరికరంలో స్మార్ట్‌ఫోన్ సౌలభ్యం, ట్యాబ్లెట్ స్థాయి పెద్ద స్క్రీన్ అందించడం. అయితే దీని అధిక ధర కారణంగా ఇది ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఫోన్‌గా కనిపిస్తోంది
ఈ నిర్ణయంతో ఆపిల్ సంస్థలో ఒక కొత్త శకం మొదలైందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


