ఆన్‌లైన్ షాపింగ్‌లో వినియోగదారులకు మరింత రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ సంస్థల వ్యవహారాల్లో పారదర్శకత పెంచడంతో పాటు వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలను సవరించింది. 2020 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలకు చేసిన సవరణలను ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్, సవరణ) నిబంధనలు, 2026’గా ప్రకటించింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
డిస్కౌంట్లపై స్పష్టత తప్పనిసరి :
ఇకపై ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు డిస్కౌంట్ ప్రకటించేటప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలి. ఆ ఆఫర్‌కు ముందు నెలలో ఉత్పత్తి విక్రయించిన కనిష్ఠ ధరను వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారులు వెతికిన లేదా పరిశీలించిన ఉత్పత్తుల సెర్చ్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా మార్చడం వంటి చర్యలను నిషేధించారు.
స్పాన్సర్డ్ లిస్టింగ్స్‌కు ప్రత్యేక నిబంధనలు :
వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా స్పాన్సర్డ్ లిస్టింగ్స్ వివరాలను ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాలి. అంతేకాకుండా డార్క్ ప్యాటర్న్స్ నిబంధనలు పాటిస్తున్నట్లు ప్రతి సంస్థ ఏటా సెల్ఫ్ ఆడిట్ సర్టిఫికెట్‌ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖకు సమర్పించాలి. ఈ సర్టిఫికెట్‌ను తమ వెబ్‌సైట్లలోనూ ప్రదర్శించాలి.
ఫిర్యాదులు, ఉత్పత్తి వివరాల్లో పారదర్శకత :
ప్రతి సంస్థ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌తో ఏకీకరణ ప్రక్రియలో భాగస్వామి కావాలి. గ్రీవెన్స్ అధికారి ఫిర్యాదుల పరిష్కార పురోగతిపై వినియోగదారులకు ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఉత్పత్తుల బెస్ట్ బిఫోర్, యూజ్ బిఫోర్ తేదీలు, రిటర్న్, రిఫండ్, వారెంటీ, డెలివరీ, చెల్లింపు వివరాలను స్పష్టంగా అందించాలి.
దిగుమతి వస్తువులపై పూర్తి సమాచారం :
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను విక్రయించే సంస్థలు దిగుమతిదారు వివరాలతో పాటు వస్తువు ఏ దేశం నుంచి వచ్చిందనే సమాచారాన్ని కూడా వెల్లడించాలి. వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను ఇతర అవసరాలకు ఉపయోగించడంపైనా కొత్త నిబంధనలు ఆంక్షలు విధించాయి.


