భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలందించే ఐఆర్సీటీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 7న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 20,06,353 రిజర్వేషన్ టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్సీటీసీ చరిత్రలో ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు రోజు సైతం దాదాపు 19.50 లక్షల టికెట్లు రిజర్వ్ అయ్యాయి.
పాత రికార్డు బద్దలు :
గతేడాది ఒకే రోజులో అత్యధికంగా 18.40 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. తాజాగా నమోదైన గణాంకాలతో ఆ రికార్డు పూర్తిగా చెరిగిపోయింది. పండగల సీజన్ సమీపిస్తుండటంతో ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవడమే ఈ భారీ బుకింగ్స్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
89 శాతం బుకింగ్స్ ఆన్లైన్లోనే :
ప్రస్తుతం రిజర్వ్డ్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. కేవలం 11 శాతం మంది మాత్రమే రైల్వే కౌంటర్లను ఆశ్రయిస్తున్నారు. మొబైల్ యాప్‌లు, డిజిటల్ సేవలతో ఇంటి నుంచే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆన్లైన్ బుకింగ్స్ భారీగా పెరిగాయి.
సాంకేతికతతో సులభమైన బుకింగ్ :
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ సర్వర్లను ఆధునీకరించింది. కొత్త బీటా ఇంటర్ఫేస్లో స్లీపర్, ఏసీ తరగతుల సీట్ల లభ్యత ఒకే స్క్రీన్‌పై కనిపించేలా మార్పులు చేశారు. అలాగే యాంటీ-బాట్, సీడీఎన్ టెక్నాలజీతో అనధికారిక బాట్ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు భారీ సంఖ్యలో నకిలీ యూజర్ ఐడీలను కూడా బ్లాక్ చేస్తున్నారు.


