అంతర్జాతీయ దౌత్య వేదికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. 18వ బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరపనున్న ద్వైపాక్షిక భేటీపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. అయితే జిన్‌పింగ్ ప్రయాణిస్తున్న ప్రత్యేక లిమోజిన్ ‘హాంగ్కీ N701’ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చైనాలో ప్రత్యేక గుర్తింపు :
‘హాంగ్కీ’ అనే చైనీస్ పదానికి ‘ఎర్ర జెండా’ అని అర్థం. 1958లో ప్రారంభమైన ఈ బ్రాండ్‌కు చైనాలో ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉంది. గతంలో దేశ అగ్రనేతల అధికారిక ప్రయాణాలకు ఈ బ్రాండ్ కార్లను ఉపయోగించేవారు. ప్రస్తుతం జిన్‌పింగ్ వినియోగిస్తున్న N701 సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. అత్యున్నత స్థాయి ప్రభుత్వ అవసరాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని తయారు చేస్తున్నట్లు సమాచారం.
భద్రతకు పెద్దపీట :
హాంగ్కీ N701ను అత్యంత భద్రతతో రూపొందించిన వాహనంగా చెబుతున్నారు. సుమారు 5.5 మీటర్ల పొడవున్న ఈ కారులో బుల్లెట్ ప్రూఫ్ టైర్లు, ప్రత్యేక ఆర్మర్ ప్లేటింగ్ వంటి రక్షణ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం. తుపాకీ కాల్పులు, పేలుళ్ల వంటి ప్రమాదాల నుంచి ప్రయాణికులను రక్షించేలా దీన్ని రూపొందించారు.
రసాయన లేదా విషవాయు దాడి జరిగినా లోపల ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక ఎయిర్ కంప్రెషన్ వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 6.0 లీటర్ల V12 ఇంజిన్ సుమారు 408 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం.
‘ది బీస్ట్’తో పోలిక :
అమెరికా అధ్యక్షుడి అధికారిక వాహనం ‘ది బీస్ట్’తో హాంగ్కీ N701ను నిపుణులు పోలుస్తున్నారు. అయితే చైనా తన అధ్యక్షుడి వాహనానికి సంబంధించిన పూర్తి భద్రతా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. హాంగ్కీ N701 ప్రత్యేకత ఒకవైపు ఆసక్తి రేపుతుండగా, మోదీ–జిన్‌పింగ్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సరిహద్దు అంశాలు, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించే అవకాశం ఉంది.


