బిగ్ బ్రేకింగ్: అల్లు అర్జున్ మామ పై పోలీస్ కేసు :
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని నానక్రామ్గూడలో చోటుచేసుకున్న భూవివాదం మరో మలుపు తిరిగింది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మంత్రి కాస్మోస్ గేటెడ్ కమ్యూనిటీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో మురళీధర్ రెడ్డి, గడ్డం రవిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది.
గేటు తాళాలు పగులగొట్టి చొరబాటు? :
అసోసియేషన్ ఫిర్యాదు ప్రకారం.. చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు మంత్రి కాస్మోస్ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయి. గేటుకు ఉన్న తాళాలను ధ్వంసం చేసి, అక్కడి నిర్మాణాలకు నష్టం కలిగించడంతో పాటు తమకు చెందిన స్థలంగా పేర్కొంటూ టిన్షీట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెక్యూరిటీ సిబ్బందికి బెదిరింపులు :
ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులను నిందితులు బెదిరించినట్లు ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. అడ్డువచ్చిన వారిని తోసివేయడంతో పాటు, తమ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపింది.
సీసీటీవీ ఫుటేజీల పరిశీలన :
ఫిర్యాదును స్వీకరించిన గచ్చిబౌలి పోలీసులు అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


