వరంగల్: జిల్లాకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ఉల్లాస్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కన్వర్జెన్సీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
అభ్యర్థులందరూ పరీక్షకు హాజరయ్యేలా చూడాలి
సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించనున్న ఉల్లాస్ పరీక్షకు, ఉల్లాస్ పోర్టల్లో నమోదైన ప్రతి మహిళ హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. నమోదైన అభ్యర్థులందరికీ ముందస్తుగా అవగాహన కల్పించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ద్వారా జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి, నిరక్షరాస్యులలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా వరంగల్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయించిన అడ్మిషన్ల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్హులైన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించేలా విస్తృత ప్రచారం నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, డీఎంసీ రేణుక, ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం, వరంగల్ జిల్లా ఉల్లాస్ ఇన్చార్జి నాగేశ్వరరావు మరియు వివిధ మండలాల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


