హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలకు బాటలు వేసిన వరంగల్ ప్రభుత్వ ఐటీఐకు కొత్త రూపు రానుంది. ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్న పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణంతో పాటు ఆధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తం రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
67 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం :
వరంగల్ ములుగు రోడ్డులో ప్రభుత్వ ఐటీఐ భవనాన్ని 1959లో నిర్మించారు. అప్పట్లో సుమారు 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ భవనానికి ప్రస్తుతం 67 ఏళ్లు పూర్తయ్యాయి. నిర్వహణ లోపంతో భవనం గోడలు, కిటికీలు, తరగతి గదుల తలుపులు దెబ్బతిన్నాయి. దీంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటూ అదే భవనంలో శిక్షణ కొనసాగించాల్సి వచ్చింది.
రూ.25 కోట్లతో కొత్త భవనం :
ఐటీఐ ప్రిన్సిపల్ చందర్ విజ్ఞప్తి మేరకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి) కింద రూ.25 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జీ+1 భవనం, నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, విద్యుదీకరణ, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. నిర్మాణ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి.
‘పీఎం సేతు’తో ఆధునిక పరికరాలు :
వరంగల్ ఎంపీ కడియం కావ్య చొరవతో ఐటీఐకి మరో కీలక అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సేతు’ పథకం కింద వరంగల్ ఐటీఐకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆధునిక మెషినరీ, పరికరాల ఏర్పాటు, ట్రేడ్‌ల అప్‌గ్రేడేషన్, వర్క్‌షాప్‌ల పునరుద్ధరణ వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రాంగణంలో మూడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు నిర్మించారు.
620 మంది విద్యార్థులకు ప్రయోజనం :
ప్రస్తుతం ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మన్ సివిల్, డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా తదితర ట్రేడ్‌లలో సుమారు 620 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. కొత్త భవనం, ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తే శిక్షణ నాణ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువత పొందడంతో ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.


