హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొని మంత్రి పొంగులేటితో కలిసి జెండా ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు.
అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ అదాలత్ సర్కిల్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎంపీ కడియం కావ్య, ఇతర ప్రజాప్రతినిధులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.
త్యాగధనుల త్యాగాల ఫలితమే ప్రజాపాలన: మంత్రి పొంగులేటి
కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారన్నారు. నాటి అమరుల త్యాగాలను తక్కువ చేయకుండా సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, వారి పోరాటాల ఫలితంగానే విజయం సాధించామని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు – ప్రధాన ప్రసంగ ముఖ్యాంశాలు:
గృహ జ్యోతి ద్వారా 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశామని తెలిపారు. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.70 వేల కోట్ల రుణాలు, వడ్డీ లేని రుణాల కింద రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని వివరించారు.
భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా చారిత్రాత్మక భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. 2025 ఏప్రిల్ 14 నుంచి 5,68,858 పాస్‌బుక్‌లు జారీ చేశామని స్పష్టం చేశారు. 125 ఏళ్ల తర్వాత తొలిదశలో 2,240 గ్రామాల్లో రీసర్వే చేపట్టామని, ప్రతి భూకమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి ‘భూధార్’ నంబర్ కేటాయిస్తున్నామని చెప్పారు
హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో హనుమకొండ-వరంగల్‌లను సమగ్రంగా అభివృద్ధి చేసి మహానగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ప్రకటించారు. మాస్టర్‌ప్లాన్‌తో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ మెరుగుపరిచి ఆధునిక, హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ ప్రజాపాలన వేడుకలలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ రవి, కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, డీఆర్వో శ్రీనివాస్ మరియు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


