యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదించిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం పెట్రోల్ బంక్ డీలర్లలో ఆందోళనకు కారణమవుతోంది. కొత్త ఛార్జీల ప్రభావంతో తమ మార్జిన్లు మరింత తగ్గిపోతాయని డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో రూ.2,000కు మించిన కొన్ని UPI లావాదేవీలను నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రూ.5 ఫ్లాట్ MDR ఛార్జీ :
అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని రకాల మర్చంట్ UPI లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR ఛార్జీ వర్తించనుంది. దీంతో ఇప్పటికే తక్కువ మార్జిన్లతో పనిచేస్తున్న పెట్రోల్ బంక్ డీలర్లపై అదనపు భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లీటర్కు రూ.2.40–రూ.3.40 మార్జిన్ :
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై తమకు లీటరుకు సుమారు రూ.2.40 నుంచి రూ.3.40 వరకు మాత్రమే మార్జిన్ ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. కొత్త MDR ఛార్జీలను భరించాల్సి వస్తే ఈ ఆదాయం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. తమ అవుట్లెట్లలో 60 శాతానికి పైగా ఇంధన విక్రయాలు డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయని అసోసియేషన్ తెలిపింది.
నగదు చెల్లింపుల వైపు మొగ్గు :
జీరో MDR విధానం ఉన్న సమయంలో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టామని డీలర్లు చెబుతున్నారు. పెరుగుతున్న నిర్వహణ, నిబంధనల అమలు ఖర్చులతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నామని పేర్కొంటున్నారు. దశాబ్ద కాలంగా కమీషన్లలో గణనీయమైన మార్పు లేదని, ఇంధన ధరలు నియంత్రితంగా ఉండటంతో లావాదేవీ ఛార్జీలను వినియోగదారులపై మోపడం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అదనపు భారాన్ని రిటైలర్లే భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


