రేషన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం అమలు చేస్తున్న స్మార్ట్ పీడీఎస్ (Smart PDS) విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంతకాలంగా రేషన్ తీసుకోని కార్డులను గుర్తించి నిలిపివేసే చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఆరు నెలలకు పైగా రేషన్ వినియోగించని కార్డులు 16 లక్షలకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కనీసం ఆరు లక్షలకు పైగా కార్డులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోతే :
ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోని కార్డుదారులు తమ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే e-KYC పూర్తి చేయడంతో పాటు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. నిలిపివేసిన కార్డులోని సభ్యులందరూ మూడు నెలల్లోగా e-KYC పూర్తి చేస్తే తిరిగి రేషన్ పొందే అవకాశం ఉంటుంది.
ఒక వ్యక్తికి రెండు కార్డులు ఉంటే :
స్మార్ట్ పీడీఎస్ ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల వివరాలను కేంద్రస్థాయిలో సమీకరించనున్నారు. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో లేదా ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డుల్లో సభ్యుడిగా ఉన్నారా అనే విషయాన్ని కూడా గుర్తిస్తారు. ఒకటి కంటే ఎక్కువ కార్డుల్లో పేరు ఉంటే, లబ్ధిదారులు మూడు నెలల్లోగా e-KYC పూర్తి చేసి ఏ కార్డును కొనసాగించాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన కార్డుల నుంచి పేరును తొలగించాల్సి ఉంటుంది.
పలు రకాల కార్డులపై ప్రభావం :
స్మార్ట్ పీడీఎస్ తొలి దశలో పసుపు, గులాబీ కార్డులను పరిశీలించనున్నారు. కేరళలో ఈ రెండు కేటగిరీల్లో సుమారు 45 వేల కార్డులు, 66 వేల మంది లబ్ధిదారులు ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. అలాగే నీలం, గోధుమ, తెలుపు కార్డుల్లోనూ ఎక్కువకాలంగా రేషన్ తీసుకోని లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత కార్డులను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది.


