వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న గృహ సమస్యలను అసెంబ్లీ వేదికగా ఆ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేకపోవడం వల్ల నిరుపేదలు సొంత ఇల్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రధాన డిమాండ్లు & అంశాలు:
వరంగల్-హనుమకొండ పరిధిలో 40-50 ఏళ్ల క్రితం నిర్మించిన హౌసింగ్ బోర్డు కాలనీలోని వెయ్యి ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ భూమి నగరంలో కీలక ప్రాంతంలో ఉన్నందున పాత ఇళ్లను పునరుద్ధరించడం లేదా తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని కోరారు.
హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో, భూములు లేని పేదల కోసం బహుళ అంతస్తుల ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మించాలని, అందులో భాగంగా వరంగల్-హనుమకొండ ప్రాంతానికి కూడా ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హౌసింగ్ బోర్డు కాలనీ లబ్ధిదారులకు పూర్వపు వన్‌టైమ్ సెటిల్మెంట్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల బకాయిలు చెల్లించలేకపోయిన వారికి మరోసారి OTS అవకాశాన్ని కల్పించాలని కోరారు.
మంత్రి పొంగులేటి సానుకూల స్పందన
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లలో నిరుపేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మించే కార్యాచరణ జరుగుతోందని, అందులో భాగంగా వరంగల్-హనుమకొండలో కూడా టవర్స్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ అంశాన్ని పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సభలో వెల్లడించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


