బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం :
ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. సెప్టెంబర్ 21 నాటికి ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం సెప్టెంబర్ 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. సెప్టెంబర్ 23 ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి చేరే అవకాశం ఉందని తెలిపింది.
12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు :
వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్ 24న మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
అదే సమయంలో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షపాతం నమోదు :
గత 24 గంటల్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 13.9 సెం.మీ., ములుగు జిల్లా ఏటూరునాగారంలో 10.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


