పేదరికం ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి ఉన్నత చదువులకు అడ్డంకి కారాదనే సంకల్పంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థికి అండగా నిలిచి వరుసగా రెండో ఏడాది కూడా కళాశాల ఫీజు చెల్లించారు.
ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామానికి చెందిన చిట్యాల నితిన్ అనే ప్రతిభావంతుడైన విద్యార్థి తీవ్రమైన శ్రమతో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో వైద్య విద్య ఫీజుల భారం ఆ కుటుంబానికి పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత ఏడాది మొదటి సంవత్సరానికి సంబంధించిన ఫీజును స్వయంగా అందజేశారు.
తాజాగా రెండో సంవత్సరం చదువు నిమిత్తం అవసరమైన రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని శనివారం హన్మకొండ కనకదుర్గ కాలనీలోని తన నివాసంలో విద్యార్థికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నితిన్ వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
వరుసగా రెండో ఏడాది కూడా తమకు కొండంత అండగా నిలిచి ఫీజు చెల్లించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నితిన్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తన లక్ష్య సాధనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని విద్యార్థి భావోద్వేగంతో పేర్కొన్నాడు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజుగారి రఘు, మాజీ సర్పంచ్ చిర్ర కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


