వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలోని వివిధ బ్లాకులు, వార్డులు, అత్యాధునిక వైద్య సదుపాయాల ఏర్పాట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులు, అధికారులను ఆదేశించారు.


