గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) సిటీ ప్లానర్‌గా రవీంద్ర రెడేకర్ నియమితులయ్యారు. ఇటీవల ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించగా, పదోన్నతి అనంతరం ప్రభుత్వం ఆయనను GWMC సిటీ ప్లానర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో రవీంద్ర రెడేకర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌గా పనిచేసి, నగర ప్రణాళికా విభాగంలో విశేష సేవలందించారు. నగర విస్తరణ, అనుమతులు, అభివృద్ధి ప్రణాళికలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన నియామకంతో గ్రేటర్ వరంగల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.


