హనుమకొండ: జిల్లాలోని వంగర, ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, ఫార్మసీ, ల్యాబొరేటరీ రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ, సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, టీబీ ముక్త్ భారత్, ఎన్‌సీడీ కార్యక్రమాల అమలు తీరుపై వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టడంతో పాటు ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్‌ఓ సూచించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో వైద్యులు డాక్టర్ రహమాన్, డాక్టర్ రూబీనా, డాక్టర్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.


