వరంగల్: కాజీపేట వైఎస్సార్ నగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, గుడిసెవాసులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తమ హక్కుల కోసం శాంతియుతంగా ప్రశ్నించిన మహిళలు, పేదలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగితే అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు.
అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, వైఎస్సార్ నగర్ మహిళలు, కాలనీవాసులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అరెస్టయిన వారిని తొలుత కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఉంచి, బుధవారం ఉదయం హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


