హన్మకొండ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు హన్మకొండ జిల్లా యంత్రాంగం సరికొత్త ముందడుగు వేసింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక చొరవతో రూపొందించిన ‘మిషన్ ఎక్సలెన్స్’ కార్యక్రమం మడికొండ గురుకులంలో ఘనంగా ప్రారంభమైంది.
ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి JEE, NEET మరియు IIT వంటి పరీక్షల కోసం ఈ శిక్షణను అందిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు 70 రోజుల పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక కోచింగ్ ఇప్పించనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి, వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణను చేరువ చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.


