న్యూఢిల్లీ | తేది: 16-03-2026
తెలంగాణ రాష్ట్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గళమెత్తారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై జరిగిన చర్చలో పాల్గొని తెలంగాణకు సంబంధించిన పలు కీలక సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఔషధ మరియు పారిశ్రామిక రంగాల్లో వేగంగా ఎదుగుతున్నప్పటికీ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు అదే స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఎంపీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు.
ప్రత్యేకంగా దేశంలోనే అత్యంత రద్దీగా మారిన కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.
కాజీపేటలో ప్రతిపాదిత రైల్ అండర్ బ్రిడ్జ్ మరియు రైల్ టన్నెల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను తక్షణమే ప్రారంభించి, అందులో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు అమలు అయితే వరంగల్ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
పరిపాలనా సౌలభ్యం కోసం కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే జోన్ లేదా బలమైన సబ్ జోన్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ కేంద్రాన్ని కోరారు.
అలాగే హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్వే కారిడార్లకు స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
తెలంగాణలో వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు ట్రాక్ విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు.


