వరంగల్: వరంగల్ నగరంలో బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ వచ్చిన ఒక అజ్ఞాత ఈ-మెయిల్ పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని 5 చోట్ల బాంబు పేలుళ్లు సంభవిస్తాయని ఆ మెయిల్లో పేర్కొనడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ముఖ్యంగా వరంగల్ కోర్టు పరిసరాల్లో బాంబు డిస్పోజల్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు జల్లెడ పట్టారు. ప్రతి గదిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గతంలో కూడా ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. చివరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది నకిలీ బెదిరింపుగా తేలింది. దీంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


